Back to News
WelfareMay 25, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Virtual Foundation Stone Laying for 8,000 SHG Village Organization Mahila Grama Sangham Buildings and Launches New Saree Design for 1 Crore Women of Telangana at Dr B R Ambedkar Telangana State Secretariat

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవ

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు అందించే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అవసరమైన స్థలం గుర్తించి మహిళా సంఘాలకు నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుపైన ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి” అని మంత్రి పొంగులేటి గారికి చెప్పారు.

ఈ సూపర్ బజార్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తామని, సంఘాల్లోని ప్రతి మహిళ కొంత మేరకు పెట్టుబడిని సమకూర్చుకోవాలని సూచించారు.

“కార్పొరేట్ కంపెనీలు నడిపిస్తున్న చైన్ సూపర్ బజార్లలో వస్తువులను అత్యధికంగా కొనుగోలు చేసేది మహిళలే. నిత్యవసర వస్తువులు, అత్యవసర వస్తువులు ఏవైనా నాణ్యమైన వస్తువులు కొనాలంటే మహిళా శక్తి బజార్లలో కొనాలి అనే విధంగా బ్రాండ్ ఇమేజీని సాధించాలి. దేశంలోనే అత్యుత్తమ సూపర్ బజార్లుగా రాణించాలి” అని అభిలషిస్తూ అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

“రైస్ మిల్లులను స్వయంగా మీరే పెట్టుకోండి. అదే విధంగా లాజిస్టిక్ సెంటర్లను కట్టుకోండి. మండలాల్లో స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద గోడౌన్లు కట్టుకోండి. భవిష్యత్ లో బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించే బాధ్యత తీసుకుంటాం.

కొత్త మంది మిల్లర్లు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. వాటిని ఆడబిడ్డలకు ఇవ్వడం ద్వారా జవాబుదారీతనంగా ఉంటారు. భవిష్యత్ లో ప్రతి మండలంలో పెద్ద పెద్ద గోడౌన్లు కట్టడం ద్వారా ధాన్యం వాటిల్లో భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుండే మిల్లర్లు తీసుకెళ్లాలి.

ప్రతి మండలంలో 2 నుండి 4 స్థలాలను గుర్తించి గోడౌన్లు నిర్మించుకోవడానికి ఏ విధమైన ప్రణాళిక అవసరమో కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశిస్తున్నా. అందుకు అవసరమైన స్థలాలు ఇచ్చే పూచీ నాది. ఇందుకు అవసరమైన రుణాలను జీరో వడ్డీతో బ్యాంకు లింకేజీ కూడా సహకారం ఇస్తాం” అని చెప్పారు

“మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళలు స్వశక్తి మీద నిలబడటానికి, ఆర్థికంగా ఎదగడానికి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా 29 నెలల్లో రూ. 10 వేల కోట్లకు పైగా సంస్థకు చెల్లించాం” అని పేర్కొన్నారు.

“ఇందిరాగాంధీ స్త్రీ శక్తి అంగన్ వాడీ భవనాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, అద్దెపై ఆర్టీసీకి ఇవ్వడానికి బస్సులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వారంలో చేపడుతున్నాం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు 8 వేల భవనాలను ఒకే రోజు శంకుస్థాపన చేసుకుని దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం” ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రులు, అధికారులను అభినందించారు.

“మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను కేటాయించి తద్వారా అద్దె రూపేణా నెలకు రూ. 70 వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు వేశాం. అందులో భాగంగా జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను అందించబోతున్నాం” అని ప్రకటించారు.

“ఆడబిడ్డలకు బ్యాంకు రుణాల లింకేజీ ఇవ్వడమే కాకుండా, వ్యాపారంలో రాణించడానికి, వారికి కావలసిన వ్యాపారాలు వారు వృద్ధి చేసుకోవడానికి వీలుగా ఈ నెల 29న వీ-హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద అవసరమైన వ్యాపారాల ప్రణాళికలను అందించే కార్యక్రమం చేపడుతున్నాం” అని చెప్పారు.

“మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నాం. మహిళా సంఘాల రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం రూ. 1390 కోట్లు చెల్లించింది. చెల్లింపుల్లో నిర్మల్ జిల్లా నూటికి శాతం నూరు శాతం చెల్లించారని” చెబుతూ ఆ జిల్లా మహిళలను ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.

అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లాల మహిళా ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలను ఆర్జించిపెట్టే పంటల మార్పిడి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.

“2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మంత్రిమండలి మొత్తం మహిళలందరినీ సొంత సోదరీమణులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది..” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

Source: I&PR TelanganaRead on I&PR Telangana →

More News